షాద్‌నగర్ : షాద్‌నగర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన విజయనగర్‌కాలనీ, కేశంపేట్రోడ్డు, మిషన్‌భగీరథ నల్లాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఎండకాలం వస్తే షాద్‌నగర్ ప్రజల గొంతులు ఎండుతుండేవని, స్వరాష్ట్రంలో ఆ తిప్పలు తప్పి ఇంటింటికీ సురక్షిత తాగునీళ్లు అందుతున్నాయని అన్నారు.
మిషన్‌భగీరథ పనులు తుదిదశకు చేరుకున్నాయని, రెండు మూడు కాలనీలు మినహా అన్ని కాలనీల్లో తాగునీళ్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారని, ఇప్పటికే సగానికి పైగా వార్డుల్లో నివాసాలకు మంచినీళ్లు అందుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ సహాకారంతో షాద్‌నగర్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. లక్షల రూపాయాలను వెచ్చించి ప్రజల అవసరాల కోసం అత్యంత నాణ్యతతో కూడిన సీసీరోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే నాగులపల్లిరోడ్డు, విజయనగర్‌కాలనీ రోడ్డు, కోర్టు రోడ్డు, ఈశ్వర్కాలనీరోడ్డు అందుబాటులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో ప్రతి కాలనీలో సీసీరోడ్ల సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు విశాల, మాధవీ, నందీశ్వర్, శ్రీనివాస్, నాయకులు ఏజాజ్ అడ్డు, శ్రీశైలం, శేఖర్, రఘుమారెడ్డి, జమృత్‌ఖాన్, జూపల్లి శంకర్, శరత్, కాలనీవాసులు పాల్గొన్నారు.