రంగారెడ్డి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్‌సిటీ లో ఫార్మాసిటీ కూడా ఉంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించి.. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్యూచర్‌సిటీలో ఏఐసిజీ, స్పోర్ట్స్సిటీతోపాటు ఫార్మాసిటీ కూడా ఉంటుందన్నారు.
శ్రీధర్‌బా బు ఫ్యూచర్‌సిటీలో ఫార్మాసిటీ కూడ ఉంటుందని ప్రకటించటం చర్చనీ యాంశంగా మారింది. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందులో భాగంగానే పరిశ్రమలు, ఐటీ పార్కులు త్వరలో ఏర్పాటు కానున్నాయన్నారు. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిలో భాగంగా రూ. నాలుగు వేల కోట్ల అంచనాతో ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు మూడువందల అడుగుల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు. కాగా, ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో మల్రెడ్డి రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, యాద య్య, కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, అధికారులు, పోలీసు లు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.