పల్లెలు, పట్టణాల్లో కంటి వెలుగు కార్యక్రమం సంబురంగా సాగుతున్నది. ప్రజాప్రతినిధులు అధికారులు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం శంకర్పల్లి, నవాబుపేట మండలాల్లో నిర్వహించిన కంటి వెలుగు క్యాంపులను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కండ్ల సమస్యలు ఉన్న వారు ఉదయమే శిబిరాలకు చేరుకొని బారులుదీరారు. వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, కండ్లద్దాలు అందజేశారు. ఇబ్బంది కలుగకుండా అధికారులు కుర్చీలు, తాగునీరు, టెంట్లను ఏర్పాటు చేశారు. రెండోరోజు రంగారెడ్డి జిల్లాలో 10,321 మందికి కంటి పరీక్షలు చేయగా, 4,519 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో మొత్తం 7,209 మందికి పరీక్షలు చేసి 1,429 మందికి గ్లాసెస్ అందజేశారు. అలాగే మరో 971 మందికి ప్రిస్క్రిప్షన్పై అద్దాలను ఆర్డరిచ్చారు.
వికారాబాద్, జనవరి 20, (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 7209 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1429 మంది రీడింగ్ అద్దాలను పంపిణీ చేయగా, దూరపు, దగ్గర చూపు కంటి సమస్య ఉన్న మరో 971 మందికి ప్రిస్క్రిప్షన్పై అద్దాలకు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. శుక్రవారం జిల్లాలోని నవాబుపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సందర్శించి, పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అంతకు ముందు సంబంధిత ప్రాంగణాన్ని కలెక్టర్ నిఖిల సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.
అదేవిధంగా వికారాబాద్ మండలం సిద్దులూరు పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మండలం చిట్యాలలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆధార్ కార్డుల వివరాలను సేకరిస్తున్న వైద్య సిబ్బంది, ప్రత్యేకంగా ఒక్కొక్కరికి బార్కోడ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ అద్దాలు 15 రోజుల్లోగా ఆయా పీహెచ్‌సీలకు చేరనున్నాయి, బార్కోడ్ ఆధారంగా సంబంధిత కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు.
రంగారెడ్డిజిల్లాలో రెండో రోజు 10,321మందికి..
షాబాద్, జనవరి 20 : అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం జిల్లావ్యాప్తంగా 80 బృందాలతో 10,321 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 100 రోజుల పాటు నిర్వహించే ఈ కంటి వైద్యశిబిరాల ద్వారా గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. శంకర్పల్లి మండలంలోని సింగపూర్‌లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిశీలించారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ప్రజలందరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
4,519 మందికి కంటి అద్దాలు..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 37 పీహెచ్‌సీల పరిధిలో ఏర్పాటు చేసిన 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది 10,321 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 4,519 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఆయా కేంద్రాలకు నియమించిన పర్యవేక్షణ అధికారులు కేంద్రాలను సందర్శించి వివరాలు తీసుకుంటున్నారు.
అంధత్వ నివారణే సీఎం కేసీఆర్ లక్ష్యం
నవాబుపేట, జనవరి 20 : రెండో విడుత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నవాబుపేట మండల కేంద్రంలోని రైతువేదికలో కొనసాగుతున్న కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించిన మంత్రి డాక్టర్లను పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ర్టంలోని అంధత్వాన్ని నిర్మూలించడానికి సీఎం కేసీఆర్ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణలోని సర్కారు దవాఖానల్లో నాణ్యమైన వైద్యం అందుతున్నదన్నారు. ప్రజల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకునే ప్రతి క్లస్టర్లో కంటి వెలుగు క్యాంపును ఏర్పాటు చేసి మందులు, నాణ్యత కలిగిన అద్దాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
వైద్యులు కూడా ఓపికతో ప్రతి వ్యక్తికి పరీక్ష చేసి మందులు, అద్దాలు అందజేయాలని సూచించారు. అంతకంటే శిబిరం వద్దకు వచ్చిన జనంతో మంత్రి మాట్లాడారు. కండ్లద్దాలు రాసిన వారికి మంత్రి స్వయంగా అద్దాలను వారి కండ్లకు తొడిగారు. తాను కూడా వైద్యం చేయించుకున్న సందర్భంగా వైద్యులు ఆనందంలో మునిగిపోయారు. అనంతరం మండల పరిధిలోని యెల్లకొండ గ్రామంలోని పర్వతీ పరమేశుడి ఆలయం చైర్మన్ భరత్‌రెడ్డి తండ్రి ప్రథమ వర్థంతిలో పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ మండలం అధ్యక్షుడు నాగిరెడ్డి, పీఏసీఎస్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్‌గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆసిరెడ్డిగారి రంగారెడ్డి, వివిధ శాఖల అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
మండల క్యాంపును పరిశీలించిన కలెక్టర్ : నిఖిల
జిల్లాలో జరుగుతున్న కంటి వెలుగు క్యాంపులను పరిశీలించడంలో భాగంగా నవాబుపేటలోని రైతువేదికలో జరుగుతున్న కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి పరిశీలించి వెళ్లిన కొద్ది సమయానికి జిల్లా కలెక్టర్ నిఖిల కూడా పరిశీలించారు. అనంతరం వైద్యులు చేస్తున్న పని విధానంపై ఆరా తీశారు. శిబిరానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి రోహిత్‌కు సూచించారు. ప్రభుత్వం మంచి ఆశయంతో ఈ పథకాన్ని తీసుకొచ్చిందని దానిని మనందరం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో..
శంకర్పల్లి జనవరి 20 : అంధత్వ రహిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే కంటి వెలుగు కార్యక్రమంతో ప్రతి ఒక్కరి కంటి సమస్యలు తీరనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపూరం వార్డులో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో కంటి అద్దాలను ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మ, కమిషనర్ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి దిక్సూచి మన తెలంగాణ
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశ పెట్టినా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది. కంటివెలుగు కార్యక్రమంతో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, అద్దాలు పంపిణీ చేస్తున్నది. మా గ్రామంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కంటి వెలుగును ప్రారంభించారు.
– నేనావత్ బాలిబాయి సర్పంచ్, గ్రామం బానాపూర్, యాలాల మండలం
కంటి వెలుగుతో కంటి సమస్యలకు చెక్..
కంటి వెలుగుతో కంటి సమస్యలకు చెక్ పడనున్నది. డాక్టర్లు చక్కగా చూశారు. అద్దాలు ఇచ్చిండ్రు. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ సారు. కంటి వెలుగుతో ఎంతో మందికి కంటి చూపు వస్తున్నది. ఉచితంగా అద్దాలు, మందులు ఇస్తుండ్రు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– జరుపల కిషన్ నాయక్, గ్రామం బానాపూర్, యాలాల మండలం
వైద్యపరీక్షలు చేసిన వెంటనే కండ్ల అద్దాలు
కంటి సమస్యను గుర్తించి వెంటనే కండ్ల అద్దాలు ఉచితంగా అందించడం చాలా సంతోషకరం. ప్రైవేటు దవాఖానల్లో కూడా ఇంత శ్రద్ధ చూపరు. డాక్టర్లు నిదానంగా కంటి పరీక్షలు చేసి తగిన సూచనలు చేస్తున్నారు. వేల రూపాయల ఖర్చుఅయ్యే వైద్యం ఉచితంగా లభించడం సంతోషకరం.
– టీ.ఆనంద్, గూడూరు, కొత్తూరు మండలం
పేదలకు వరం కంటి వెలుగు
సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం. ఎటువంటి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేయడంతో పాటు అద్దాలు అప్పటికప్పుడే ఇస్తున్నారు. కంటి చూపు సమస్యతో ఇచ్చిన నేడు ఇప్పడు అద్దాలు అందుకొని సంతోషంగా ఇంటికి వెళుతున్నా. ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు.
– చంద్రారెడ్డి, కొండారెడ్డిపల్లి
కండ్లు కనిపించక ఇబ్బందిగా ఉండేది
కండ్లు కనిపించక మూడేండ్లుగా కారు డ్రైవింగ్ చేసేందుకు ఇబ్బందులు పడ్డా. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగుతో మా కాలనీకి వచ్చి పరీక్షలు చేసి, కంటి అద్దాలను ఇచ్చిండ్రు. ఇప్పడు కండ్లు మంచిగ కనిపిస్తున్నయ్. డ్రైవింగ్ చేసేందుకు వీలుగా ఉన్నది.
– మాణిక్యం, వికారాబాద్
గ్రామానికే వచ్చి అద్దాలిచ్చిండ్రు
గ్రామంలోనే కంటి వెలుగు క్యాంపు పెట్టిండ్రు. డాక్టర్లు పరీక్షలు చేసి, అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. ప్రైవేటు దవాఖానకు వెళ్లి డబ్బులు పెట్టే స్థోమత లేదు. పైసా ఖర్చు లేకుండా కండ్ల పరీక్షలు చేయడంతో పాటు మందులు, కండ్ల అద్దాలు ఇచ్చిండ్రు.
– నర్సింహులుగౌడ్, మన్మర్రి(షాబాద్)