కందుకూరు, అక్టోబర్ 11 : బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు బాటలు వేయాలని, పార్టీ శ్రేణులే నా బలం, బలగమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల మాదిరిగా ఇష్టానుసారంగా మాట్లాడితే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. బుధవారం మండలంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేయడానికి కష్టపడాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు విషయంలో రాజకీయం చేస్తున్నారని తెలిపారు. పొరపాటున కూడా ఆ పార్టీలకు ఓటు వేయవద్దన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టే అధికారంలోకి రావాలన్నారు. నిరంతరం మీ వెంట ఉండే సబితమ్మ కావాలా.. కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులు కావాలా.. ఆలోచించాలని ప్రజలకు సూచించారు.