షాబాద్/శంకర్పల్లి, జనవరి 20: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా.. రైతు పక్షపాతిగా అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీకారానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య తో కలిసి హాజరై.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పాపారావు, వైస్ చైర్మన్‌గా వెంకటేశ్, డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీడీఎల్ చౌరస్తా నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ఎడ్లబండి ర్యాలీలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన రాష్ట్రంలో ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇక్కడి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో శంకర్పల్లి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయ ని.. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరం ఇక్కడి వరకు విస్తరించనున్నదన్నారు.
రైతుబంధు పథకం ప్రారంభమైన నాటినుంచి చేవెళ్ల నియోజకవర్గంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.855 కోట్లు జమైనట్లు, రైతుబీమా కింద రూ.53.20 కోట్లు రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించిందన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని తమ రాష్ర్టాల్లోనూ అమలు చేస్తామని ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాల సీఎంలు పేర్కొనడం.. ఆ కార్యక్రమ ప్రాధాన్యాన్ని తెలుపుతుందన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ… తెలంగాణ రా ష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎం తో కృషి చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించాలనే వివిధ పథకాలను అమ లు చేస్తూ ఆదుకుంటున్నారని అన్నారు. తన హయాంలో చేవెళ్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, పీఏసీఏస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, తహసీల్దార్ నయిముద్దీన్, సర్పంచులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్, లలిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపాల్, మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్‌కన్నా, యూత్ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, పార్టీ నాయకులు గోవర్ధ్దన్‌రెడ్డి, కిషన్‌సింగ్, ప్రవీణ్‌కుమార్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.