కందుకూరు, జనవరి 21 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మండల పరిధి గుమ్మడవెల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్లో గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాన్పేట్, బేగరికంచె, అన్నోజిగూడ, మాదాపూరు, రాచులూరు, తిమ్మాపూరు, లేమూరు, జబ్బార్‌గూడ, బైరాగిగూడ, అగర్మియాగూడ, సరస్వతిగూడ, కొలనుగూడ తదితర గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలిత రాష్ర్టాలో మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతి రోజూ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడమేనా వారి పని అని ఎద్దేవా చేశారు.
మన పథకాలను ఇతర రాష్ర్టాలవారు కోరుకోవడంతో దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి పక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. మతతత్వ పార్టీలను నమ్మవద్దన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. అభివృద్ధికి సహకరించాలన్నారు. ఉద్యమకారులను మరువనని స్వర్గీయ యాదయ్య విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ నాయకులు అధికారం కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని చెప్పారు. యువకులు ఆ పార్టీ రొంపిలో పడకుండా చూడాలని కోరారు.
దేశంలో కేసీఆర్ పాలన కోరుకుంటుండ్రు
దేశంలో సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు భయపడుతున్నారన్నారు.
కష్టపడి పనిచేయాలి
బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పని చేయాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, లచ్చానాయక్, మేఘనాథ్‌రెడ్డి, దశరథ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, యూత్ అధ్యక్షుడు విజ్ఞేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ రాములు, మాజీ సర్పంచ్ నందీశ్వర్ పాల్గొన్నారు.