మునుగోడు, ఫిబ్రవరి 12 : కార్మికులకు మరణ శాసనమైన నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఏఐటీయూసీ, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలతో వందలాది మంది కార్మికులతో కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ తీసి తదనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సమ్మెలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుజ రామచంద్రం పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2025 తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి విబి జీ.రామ్ జీ అని పేరు మార్చడం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసిలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం దారుణం అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలో వచ్చిన కానుండి రైతులపై, రైతు కూలీలపై, కార్మికులపై, కర్షకులపై దారుణమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి చట్టాలు అమలు అయితే దేశంలో సాధారణ మానవుడు బతికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ అదానీ, అంబానీకి దేశ సంపద అప్పచెబుతుందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమాలు శరణ్యం అన్నారు. రాబోవు రోజుల్లో వామపక్ష కార్మిక సంఘాలు ఐక్యతతో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య, సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు బండమీది యాదయ్య, ఏఐటీయూసీ. మండల అధ్యక్షులు దుబ్బ వెంకన్న, సిఐటియు నాయకులు యాసరాని శ్రీను, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పందుల చిన్న నరసింహ, జిపి వర్కర్స్ నాయకులు రెడ్డిమల్ల యాదగిరి, మాజీ జడ్పిటిసి గోస్కొండ లింగయ్య, పెరుమాండ్ల రాజీవ్, అంగన్వాడీ మండల అధ్యక్షురాలు దాసరి అన్నపూర్ణ, బజారు హమాలీ కార్మిక సంఘం నాయకులు చిరంజీవి, మిల్లు హమాలీ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వర్రె ముత్తయ్య, బొల్లం రాములు, చందపాక యాదయ్య, అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ పారిజాత, శంకర్, సైదులు, హుస్సేన్, వెంకన్న పాల్గొన్నారు.