వికారాబాద్, ఏప్రిల్ 4 : పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ దేవసేనలతో కలిసి మంత్రి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4.95 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మనమందరం బాధ్యతగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల సందర్శన
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాలను సందర్శిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో తెలుగు పేపర్ లీకేజీ విషయంలో బాధ్యులైనవారిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. వారిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్ అధికారులను సమన్వయపరుస్తూ నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు ఎవరూ రాకుండా, సెల్ఫోన్లు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, అడిషనల్ ఎస్పీ మురళీధర్ పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో, ఆర్డీవో, డీఎస్పీ
పదో తరగతి పరీక్షలు మంగళవారం తాండూరు నియోజకవర్గంలో పకడ్బందీగా జరిగాయి. విద్యాశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు తాండూరులో పరీక్షలు జరిగినంతవరకు జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. పరీక్ష కేంద్రాలను డీఈవో రేణుకాదేవి, ఆర్డీవో అశోక్ కుమార్, డీఎస్పీ శేఖర్‌గౌడ్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా తగు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందకూడదన్నారు. ప్రశాంతంగా విద్యార్థులు పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలను బయటకు పంపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ఎందుకు..? ఎవరి కోసం పంపించారు..? అనే దానిపై పూర్తి కోణంలో విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇందుకు కారణమైన అందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.