షాబాద్, ఫిబ్రవరి 21: నేడు మండలంలో జరుగనున్న మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం 10 గంటలకు అప్పా జంక్షన్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల మండలాల మీదుగా షాబాద్ మండలానికి చేరుకుంటారని తెలిపారు. ముందుగా హైతాబాద్‌లో కొద్దిసేపు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతారని చెప్పారు. అనంతరం వెల్స్పన్ కంపెనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ యూనిట్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేటీఆర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు.