కొత్తూరు, అక్టోబర్ 3: మంత్రి కేటీఆర్ ఈ నెల 5న కొత్తూరులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంత్రి మొదట కొత్తూరుకు వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తారని వివరించారు. ఆ తర్వాత షాద్‌నగర్ వెళ్తారని చెప్పారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నారాయణరేడ్డి, దేవేందర్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, సీఐ శంకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.
నందిగామ : నందిగామ మండలం చాకలిగుట్టతండా సర్పంచ్ రాజూనాయక్ ఆధ్వర్యంలో సకల హంగులతో చాకలిగుట్టతండా నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తయింది. ఈ నెల 5న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం హెలీప్యాడ్‌లో మంత్రి కేటీఆర్ చాకలిగుట్టతండా చేరుకొని గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు సర్పంచ్ రాజూనాయక్ తెలిపారు. అనంతరం కొత్తూరు మున్సిపాలిటీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లనున్నట్లు తెలిపారు. నందిగామ సీఐ సురేశ్ మంగళవారం హెలీప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని, మంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పూర్తి బందోబస్తుతో ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.