రంగారెడ్డి, జూలై 19(నమస్తే తెలంగాణ) : సకల హంగులతో అత్యద్భుతంగా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. శంషాబాద్ హుడాకాలనీలో విశాలమైన స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు. సమావేశ మందిరం, మంత్రులు, వీఐపీల కోసం విశ్రాంతి గదులు, విశాలమైన పార్కింగ్, రకరకాల పచ్చని చెట్లు భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు జిల్లా మంత్రి సబితారెడ్డితోపాటు ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవం అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించే సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు.