వికారాబాద్, జూలై 28 : వేతనాలు రాకుంటే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడంలేదని.. మా పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట పెండింగ్ వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ..మధ్యాహ్న భోజన కార్మికుల పుస్తెల తాడ్లు తాకట్టు పెట్టి పేద పిల్లలకు భోజనాన్ని అందిస్తున్నారన్నారు. కొత్త మెనూకు అదనంగా బడ్జెట్ను రిలీజ్ చేయాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన కార్మిక పథకాన్ని ప్రైవేట్ పరం చేయొద్దన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్కు అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ జిల్లా అధ్యక్షుడు అలీ, కార్యదర్శి రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, శ్రీశైలం, అనంతయ్య, కృష్ణయ్య, యాదయ్య, సత్యమ్మ, శాంతమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.