రంగారెడ్డి, జూలై 11 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు (Mid Day Meal) పోరుకు సిద్ధమవుతున్నారు. అప్పులు చేసి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులకు బిల్లులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నం భోజనం తయారు చేసే కార్మికులు కూరగాయలు పప్పు ఉప్పు కోడిగుడ్లు వంటి కొనుగోలు చేసి విద్యార్థులకు సకాలంలో భోజనాలు పెడుతున్నారు కానీ వారికి బిల్లులు మాత్రం సమయానికి చేతికిందడం లేదు. దీంతో అప్పులు చేయవలసి వస్తుంది గతేడాది కాలంగా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాక వేతనాలు కూడా రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దీంతో కార్మికులు పోరాటకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్రహీంపట్నం ఎంఈఓ కార్యాలయానికి తాళం వేశారు. తమ బిల్లులు చెల్లించే వరకు తాళం తీయమని ధర్నా దిగారు. బిల్లులు చెల్లించే వరకు ఆందోళన చేయాలని కార్మికులు నిర్ణయించారు. కానీ ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని, ప్రధానోపాధ్యాయులు మాత్రం మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే వారంలో మూడుసార్లు కోడిగుడ్లు కూడా పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేయక తప్పడం లేదు. బిల్లుతోపాటు కార్మికులకు ఇచ్చే వేతనాలు కూడా ఇవ్వడం లేదని, తాము వెట్టిచాకి వస్తుందని మధ్యాహ్నం భోజన కార్మికులు వాపోతున్నారు.
జిల్లాలో 2400 మంది కార్మికులు..
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన అందించడం కోసం సుమారు 2400 మంది పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. కూరలు, కోడిగుడ్లు వంటివి కార్మికులు తయారు చేయాల్సి ఉంది. వీడికి సంబంధించిన బిల్లులను అలాగే కార్మికులకు వేతనాలు కూడా ప్రతి నెల ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సంవత్సరాల తరబడి బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుల పాలు అవుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చేది రూ.5.. మార్కెట్లో గుడ్డు రూ.7
మధ్యాహ్న భోజనంలో భాగంగా వారానికి మూడుసార్లు విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ.7 ఉంది. ఒక గుడ్డు కార్మికులు రూ.2 అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే మెనూ ధర ఏమాత్రం సరిపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.
జాడ లేని రాగి జావా
గత ప్రభుత్వాలయంలో విద్యార్థులకు రాగిజావను అందించే వారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇప్పటివరకు రాగి జావా ఇవ్వడం లేదు. మరోవైపు ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పలు రకాల మెనూ ఇచ్చింది. కానీ మెనూ ప్రకారం బిల్లులు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. సకాలంలో బిల్లును చెల్లిస్తే మరింత నాణ్యమైన భోజనాన్ని అందిస్తామని మధ్యాహ్న భోజన కార్మికులు కోరుతున్నారు.
కోట్లలో బకాయిలు
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం సుమారు రూ.3 నుంచి రూ.4 కోట్ల బిల్లులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అలాగే కార్మికుల వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది, పది తరగతులకు బిల్లులు ఇవ్వాల్సి ఉంది. కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు వాపోతున్నారు.
వెంటనే బకాయిలు చెల్లించాలి..
జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు, వేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకురాలు స్వప్న డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించే వరకు ఆందోళనలను కొనసాగిస్తాన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఉపాధి పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించిన ప్రభుత్వం వారికి సకాలంలో బిల్లులు చెల్లించక అప్పుల పాలు చేస్తున్నదని విమర్శించారు.