నగరం నుంచి శివారు ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో భాగ్యనగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరింత మహర్దశ రానున్నది. పెద్ద ఎత్తున విస్తరిస్తున్న కాలనీలు, ఏర్పాటవుతున్న పారిశ్రామిక వాడలతో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ తరుణంలో రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు శివారు ప్రాంతాలకూ మెట్రోరైలు సేవలు అందించాలని యోచిస్తున్నది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోలైన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది. సుమారు 20కిలోమీటర్ల రైల్వేలైన్ కోసం రూ.6వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నది. ఎయిర్‌పోర్టు వరకు వచ్చే మెట్రో మార్గాన్ని తుక్కుగూడ పారిశ్రామికవాడ వరకు పొడిగించాలని ఇటీవల మంత్రి సబితారెడ్డితోపాటు పలువురు సీఎం కేసీఆర్‌కు విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతోపాటు జిల్లాలో ఏర్పాటవుతున్న ఫాక్స్‌కాన్, ఫార్మాసిటీల వరకూ మెట్రో రైలు సేవలు విస్తరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అదేవిధంగా ఎల్బీనగర్ వరకు అందుబాటులో ఉన్న మెట్రో రైల్వేను హయత్‌నగర్ వరకు పొడిగించాలని యోచిస్తున్నది.
ఇబ్రహీంపట్నం, జూన్ 26: నగర శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో త్వరలో మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఓవైపు విస్తరిస్తున్న కాలనీలు, మరోవైపు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న పారిశ్రామిక వాడలతో రంగారెడ్డి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెట్రోరైలు సేవలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటించిన సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు మెట్రోరైలు సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూరి ్తచేసింది. నగరం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 20 కిలో మీటర్ల రైల్వేలైన్ కోసం రూ.6,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి పక్కన ఉన్న తుక్కుగూడ పారిశ్రామిక వాడ వరకు మెట్రో సదుపాయం కల్పించాలని ఇటీవల రావిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు పలువురు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు తుక్కుగూడ వరకు మెట్రోసేవలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని హయత్‌నగర్ వరకు మెట్రోరైలు పొడిగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. దీంతో జిల్లాలోని శంషాబాద్, తుక్కుగూడ, హయత్‌నగర్‌లకు త్వరలోనే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
త్వరలో ఫాక్స్‌కాన్, ఫార్మా సిటీ వరకు!
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రూ.6,000కోట్లతో మెట్రోరైలు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే, తుక్కుగూడ వరకు కూడా దీనిని పొడిగించనుంది. తుక్కుగూడ నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్‌తో పాటు ఫాక్స్‌కాన్ కంపెనీ వరకు మెట్రో సేవలు విస్తరించాలని యోచిస్తున్నది. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ కంపెనీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కంపెనీ ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫాక్స్‌కాన్ కంపెనీకి వచ్చేవారి కోసం కొంగరకలాన్ వరకు మెట్రోరైలు సేవలందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. తుక్కుగూడ నుంచి ఫాక్స్‌కాన్ వరకు మెట్రోలైన్ ఏర్పాటు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఫార్మాసిటీ వరకు కూడా మెట్రోసేవలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎల్బీనగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, దీనికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న హయత్‌నగర్ వరకు పొడిగిస్తే శివారు ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
మారనున్న రూపురేఖలు
అభివృద్ధితో పాటు పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్న రంగారెడ్డి జిల్లాలో మెట్రోసేవలు విస్తరిస్తే భవిష్యత్తులో జిల్లా స్వరూపమే మారిపోనుంది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో అనేక పారిశ్రామిక వాడలు ఏర్పాటవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో కాలనీలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. వివిధ రాష్ర్టాలకు చెందిన ఎంతోమంది శివారు ప్రాంతాల్లో ఇండ్లస్థలాలు కొనుగోలుచేసి నివాసముంటున్నారు. వీరంతా శివారు ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో ఉపాధి పొందుతున్నారు. దీంతో జిల్లాలో కొత్త కాలనీలు వేలాదిగా వెలుస్తున్నాయి.
మెట్రోతో అభివృద్ధి
రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ వద్ద ఏర్పాటుచేస్తున్న ఫాక్స్‌కాన్‌తో పాటు ఫార్మాసిటీ వరకు మెట్రోరైలు సేవలను అందిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. రవాణా సౌకర్యం కూడా మెరుగవుతుందని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. రంగారెడ్డి కలెక్టరేట్, ఫాక్స్‌కాన్, టీసీఎస్, టాటా ఏరోస్పేస్ వంటివాటితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న విద్యాసంస్థలకు వచ్చే విద్యార్థులకు మెట్రో సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే