రంగారెడ్డి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో పశు వైద్యం పడకేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూగ జీవాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు, ఇతరత్రా వ్యాధులకు సంబంధించిన మందులను అందించేవారు. అత్యవసర వైద్యానికి 1962 వాహనాలు కూడా అందుబాటులో ఉండేవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. జిల్లాలో పశు పోషణ భారంగా మారిందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
సకాలంలో వైద్యం అందకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి ఉచితంగా రావాల్సిన నట్టల నివారణ మందులు, యాంటీ బయోటిక్స్, ఇతర అత్యవసర మందులు అందడంలేదని.. పశు వైద్యశాలలకెళ్తే స్టాక్ లేదని.. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కోవాలని అక్కడి సిబ్బంది చిట్టీలు రాసిస్తున్నారని వాపోతున్నారు. ఆ మందులను బయట కొనాలంటే రూ.500-రూ.2వేల వరకు ఖర్చవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, సబ్సెంటర్లు పేరుకే అన్నట్లుగా మారిపోయాయి.
జిల్లాలో ఆవులు, గేదెలు, ఎద్దులు కలిపి సుమారు 4,70,000, గొర్రెలు, మేకలు 10,00,000 వరకు ఉన్నాయి. మూగ జీవాలు రోగాల బారిన పడినప్పుడు పశు వైద్యశాలకెళ్తే అవసరమైన మం దులు కాకుండా సాధారణ మందులను ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అవసరమైన మందులు కావాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.
వ్యాధుల బారిన మూగజీవాలు
ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ముందస్తుగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలలోనే మూగజీవాలకు నట్టల నివారణతోపాటు వ్యాధి నిరోధక టీకాలను వేయించేవారు. ప్రస్తుత ప్రభుత్వం మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించకపోవడంతో అవి మృతువాతపడుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గ్రామాల్లో పశుపోషణ భారీగా పెరిగి ఎంతో మంది దానిపై ఆధారపడి జీవించారు. నేడు ఆ పరిస్థితి అగుపించడంలేదు.
సకాలంలో అందని 1962 వైద్య చికిత్సలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూగజీవాలకు సత్వరమే వైద్యాన్ని అందిం చేందుకు 1962 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాని, కాంగ్రెస్ సర్కార్ ఆ వాహనాల్లో పని చేసే సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఉద్యోగాలు మానేశారు. తద్వారా పశువులకు అత్యవసర వైద్య చికిత్సలు కూడా అందడంలేదు. 1962 వాహనాలు తమ గ్రామాల్లోకి రావడమే లేదని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
సిబ్బంది, మందులు లేక ఇబ్బంది
గత ప్రభుత్వం ప్రతి గ్రామానికీ పశువైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రైమరీ వెటర్నరీ ఆస్పత్రులు, సబ్సెంటర్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అత్యవసర సమయంలో ఆస్పత్రులకెళ్తే వైద్యులతోపాటు సిబ్బంది లేకపోవడంతో మూగజీవాలకు చికిత్స అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ వైద్యులు అందుబాటులో ఉన్నా మందులు ఉండడంలేదని.. వాటిని బయట ఉన్న షాపుల్లో కొనుగోలు చేయాలని అక్కడి సిబ్బంది చిట్టీలు రాసి ఇస్తున్నారు.
ఎందుకు మందుల్లేవని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నుంచే మందులు సరఫరా కావడంలేదని చెబుతున్నారు. ప్రస్తుతం సరిపడా సిబ్బంది లేక పల్లెల్లోని ఉన్న పశు వైద్యశాలలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజులుగా తెరవడమే లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం తెరిచి మధ్యాహ్నానికే మూసేస్తున్నారు. వీఎల్వోలు, అటెండర్లు లేక ఒకే అధికారి పని చేస్తున్న పశు వైద్య కేంద్రాలు జిల్లాలో చాలా ఉన్నాయి.