వికారాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై దాదాపు ఏడాది దాటినా పూర్తి కావడం లేదు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయని పలువురు మండిపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో జరిగే పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు..ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణంలో పట్టించుకోవడంలేదనే ప్రచారం జరుగుతున్నది. జిల్లాకొక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్‌కు ప్రత్యేకంగా మెడికల్ కాలేజీని మం జూరు చేసుకున్న సీఎం… ఆ పనులు శరవేగంగా జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా.. జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణా న్ని మాత్రం వికారాబాద్, పరిగి, తాండూరు సెగ్మెంట్ల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.
ఆ భవన నిర్మాణ పనులు ప్రస్తుతం పిల్లర్ల దశలోనే ఉన్నాయి. పనులు ప్రారంభమైన నాటి నుంచి అధికారులు పర్యవేక్షిస్తే ఇప్పటివరకు 50 శాతానికిపైగా పూర్తి కావాల్సి ఉండగా, 10 శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతోపాటు మరోవైపు అధికారుల పర్యవేక్షణ కొరవడడమే. పనులు నత్తనడకన సాగితే ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి అయ్యేందుకు మరో రెండు, మూడేండ్లు పట్టే అవకాశముందని పలువురు జిల్లావాసులు పేర్కొంటున్నారు. కాగా, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బిల్లదాఖల భూముల్లోని 30 ఎకరాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని రూ.200 కోట్లతో చేపట్టారు.