Bandari Laxma Reddy | చర్లపల్లి, జూన్ 13: ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, వీఎన్‌రెడ్డినగర్, సాయికృష్ణ ఎన్క్లేవ్, శివసాయినగర్, న్యూవాసవీశివనగర్, వైష్ణవి ఎన్క్లేవ్, సోనియాగాంధీనగర్, డీసీ కాలనీ, చర్లపల్లి, బీఎన్‌రెడ్డినగర్ తదితర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్టీలకు అతీతంగా ఉప్పల్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా చర్లపల్లి డివిజన్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని, డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు అదేశాలు జారీ చేశారు. అనంతరం కుషాయిగూడలోని బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేసి సమస్యలను పరిశీలించి పిల్లలకు మంచి ఆహారం అందించాలని ఆయన సూచించారు. అదేవిధంగా బస్తీ దవాఖానాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు.