Ghatkesar | ఘట్కేసర్, మార్చి 25 : ఘట్కేసర్ గట్టు మైసమ్మ ఆలయ సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు వచ్చిన వార్తలను నిషిజా ఎస్టేట్స్ యాజమాన్యం ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ యజమాని గంగాధర్ తెలిపారు.
నిషిజా ఎస్టేట్ పేరుతో ఘట్కేసర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 543/3, 543/4, 543 /5, 543/6, 543/7, 543/8, 543/9 లోని 123 ఎకరాలలో వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గంగాధర్ తెలిపారు. హెచ్ఎండీఏ, రెరా అనుమతులతో పాటు మైనింగ్, బ్లాస్టింగ్ అనుమతులు సైతం కలిగి ఉన్నట్లు తెలిపారు. మా వెంచర్ పరిధిలో తూర్పున ఘట్ కేసర్ గట్టు మైసమ్మ ఆలయం, పడమర దిక్కున 543/2 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి 18 ఎకరాలు ఉందని గతంలో ప్రభుత్వ భూమికి నాటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సమక్షంలో హద్దులు ఏర్పాటు చేసి బోర్డులు నాటినట్లు చెప్పారు. ప్రభుత్వ భూమి చుట్టూ నిషిజా యాజమాన్యం ప్రహరీ గోడ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఘటకేసర్ గట్టు మైసమ్మ దేవాలయానికి సంబంధించిన భూమి కానీ, మరో వైపు ఉన్న ప్రభుత్వ భూమిని కానీ కబ్జా చేయలేదని వివరించారు. తాము ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తమపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ, సంస్థ పరువుప్రతిష్టలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వారిపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.