ఘట్కేసర్ రూరల్ (మేడ్చల్) : కుల వృత్తులను ప్రోత్సహించి ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్‌లో గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని కులాలు తమతమ వృత్తులను బలోపేతం చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని వెల్లడించారు. బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని ఆయన కోరారు.
కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావాలనే దురాశతో ఉన్న కాంగ్రెస్‌ను ఖతం పట్టించాలన్నారు. పేదల నుంచి ఉన్నత వర్గాల వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై అవగాహన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అనేక ఆర్థిక, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
రజకుల అభ్యున్నతికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మూసీ శంకర్, మాజీ వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి, శంకర్, చిరంజీవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.