Bandari Laxma Reddy | కాప్రా/మల్లాపూర్, ఫిబ్రవరి 28: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పల్లె, బస్తీ దవాఖానాల వైద్యులు కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్బీ కాలనీ అశోక్ నగర్ పల్లె దవాఖానాను స్థానిక కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పల్లె దవాఖానలో లభ్యమవుతున్న వైద్య సేవల గురించి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లె, బస్తీ దవాఖానాలను స్థానికుల కనీస ప్రాథమిక వైద్య అవసరాల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు.పేద ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు లభించేలా వైద్యులు తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. డాక్టర్ పల్లవి మాట్లాడుతూ.. ప్రతిరోజు 70 నుంచి 80 మందికి ఓపీ సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. స్థానికులకు షుగర్, బీపీ , ఫీవర్ , దగ్గు, జలుబు తదితర జబ్బులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. బుధవారం, శనివారం చిన్నపిల్లలకు టీకాలు వేయడం, ప్రెగ్నెన్సీ వారికి రెగ్యులర్ చెకప్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ తార, గుమ్మడి జంపాలరెడ్డి, నిస్సార్ అహ్మద్, దండెం నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు