Bandari Laxma Reddy | ఉప్పల్/ మల్లాపూర్, మే 24 : హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. మీర్పేట హెచ్బీ కాలనీ డివిజన్లోని భక్షిగూడ, కృష్ణానగర్ కాలనీలో రూ.33.50 లక్షల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను శనివారం నాడు ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రాఘవేంద్ర నగర్ అల్ అక్సా మసీదు రోడ్డు, చర్చ్ రోడ్డు లో కొత్తగా 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని, ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ ఎల్లవేళలా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే డివిజన్ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే, డివిజన్ నాయకులకు కార్పొరేటర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.