మల్కాజిగిరి, జూన్ 4: హిందూ స్మశాన వాటికలోని డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి.. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రైల్వే బోర్డు సెప్టెంబర్ 2022లో తీర్మానం చేసుకొని రైల్వే లెవెల్ క్రాసింగ్ లు, ఆర్యూబీల నిర్మాణం కోసం 100 శాతం నిధులు ఇస్తామని ఎన్వోసీలు తీసుకుందని అన్నారు. జలమండలి, విద్యుత్, టౌన్ ప్లానింగ్ వివిధ శాఖలతో సమన్వయంతో ఎన్వోసీ తీసుకొని తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సంవత్సర కాలం నుంచి ఆర్వోబీ నిర్మాణం అనుమతి తీసుకురావాలంటే సంవత్సర కాలం సమయం పట్టిందని తెలిపారు. ఆర్యూబీల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో చుట్టూ తిరిగి అక్కడ రేట్లు ఎంత ఉన్నాయని.. పరిహారం ఇవ్వడానికి ఎంత ఖర్చుకావాలనే దాని గురించి తిరగమని సూచించారు. రూ. 74 కోట్లతో వాజ్‌పేయి నగర్ రైల్వే బోర్డు ఇస్తామని చెప్పాక జీహెచ్ఎంసీ అధికారులు ఓ బండగుర్తులాగా ఇంత అవుతుందని మాత్రమే చెప్పేస్తున్నారని మండిపడ్డారు. సరైన వివరాలు లేకపోవడంతో ఫైళ్లను వెనక్కి పంపించేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపయోగంగా ఉన్న వార్డ్ ఆఫీసులను కమ్యూనిటీ హాలుగా స్థానిక కాలనీ వాసులకు ఉపయోగపడే విధంగా చూడాలని అన్నారు.
మచ్చ బొల్లారం డివిజన్లోని సర్వే నెంబర్ 198 ,199 లో గల హిందూ స్మశాన వాటికలో రెండు ఎకరాలలో డంపింగ్ యార్డ్ నిర్మించి రాంకీ సంస్థకు అప్పగించారని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. స్థానిక జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రెండు ఎకరాల స్థలం డంపింగ్ యార్డ్‌కు కేటాయించారని గుర్తుచేశారు. కానీ ఎమ్మార్వో, కలెక్టర్ అది హిందూ స్మశాన వాటిక స్థలం అని అంటున్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తే విధంగా వ్యవహరిస్తున్నారని హిందూ స్మశాన వాటిక ను పరిరక్షించాలని కోరారు. సఫిల్‌గూడలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP) నిర్మాణం వద్ద చెక్ డ్యాం కట్టేటప్పుడు సిల్ట్ తీయకపోవడంతో పేరుకుపోయి దాని వెనుక ఉన్న బలరాం నగర్ లో నీరు పేరుకుపోయాయన్నారు. దీంతో బలరాం నగర్ పరిసర కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిల్ట్ తీయమని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మెగా ప్రాజెక్టు జీహెచ్ఎంసీ అప్పగించిం ఏడాది పూర్తయ్యినా లాభం లేదని అన్నారు.