కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 11: కేంద్రం విధించిన గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే బస్తర్ రేంజ్ పరిధిలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ వివరాలను డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ బుధవారం వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పూనా మార్గెం’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అజ్ఞాతంలో ఉన్న దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీ)కి చెందిన 108 మంది మావోయిస్టులు తమ వద్ద ఉన్న 101 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో 44 మంది మహిళా మావోయిస్టు క్యాడర్లు ఉన్నారని, లొంగిపోయిన మావోయిస్టులపై రూ.3.95 కోట్ల రివార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాక వారి నుంచి ఆయుధాలతో పాటు రూ.3.61 కోట్ల నగదు, రూ.1.64 కోట్లు విలువ చేసే కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.