భద్రాచలం, ఆగస్టు 8 : అడవితల్లిపై హకులు ఒకొకటిగా చేజారుతుండడంతో తమ ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోతున్నామని ఆదివాసీలు తల్లడిల్లుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో అడవుల నుంచి తరిమి వేయబడుతున్న పరిణామాలు వారిలో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆదివాసీలు అనాదిగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై తమకు ఉన్న హక్కును అటవీ శాఖ అధికారులు లాగేసుకుంటుండటం పెద్ద సమస్యగా మారుతోంది. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న పోడు భూములు సైతం దకకుండా పోతున్న పరిస్థితులు ఆదివాసీలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, దుమ్ముగూడెం, సారపాక, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో పోడు సాగుకు సంబంధించి గిరిజనులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం, కేసులు పెట్టడం వంటివి ఇటీవల కాలంలో తరచూ వెలుగుచూస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పోడు సాగుదారులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినా అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం మారడంతో పోడు భూముల సాగుదారులపై మళ్లీ దాడులు జరుగుతూనే ఉన్నాయి.
దేశానికి మూలవాసులుగా పేరున్న ఆదివాసీలు ప్రస్తుతం తమ ఉనికి కోసమే పోరాడాల్సిన దుస్థితి నెలకొంది. గిరిజన సంక్షేమానికి వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నా అవి అంతిమంగా చేరాల్సిన వారికి చేరడం లేదనే విమర్శలున్నాయి. అనేక సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులు జరుగుతున్నా వాటి ఫలాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమానికి 1975 మార్చి 12న ఐటీడీఏ ఏర్పాటు చేసి నేటికి అర్ధ శతాబ్దం దాటినా, వేల కోట్ల నిధులు ఖర్చు చేసినా ఆదివాసీల బతుకులు మారలేదు.
ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం భద్రాచలంకు ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు సైతం లేదని పలువురు గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ట్రైకార్ ద్వారా అనేక యూనిట్లను గిరిజనులకు అందించగా ఇటీవల కాలంలో ఆ పథకం అమలు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీటి రంగాలకు కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే గ్రాంట్ల ద్వారానే నెట్టుకొస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీములకు మాత్రమే నిధులు విడుదల చేస్తుండటంతో నిధుల లేమితో భద్రాచలం ఐటీడీఏ సతమతమవుతోంది.
భద్రాచలం ఏజెన్సీకి శాపంగా మారిన పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలు ఏపీకి వెళ్లాయి. అవన్నీ కేవలం గిరిజనులు, ఆదివాసీలున్న ప్రాంతాలే. వీరందరు ఇప్పుడు తమ సొంత ఊళ్లను వదిలి మైదాన ప్రాంతాల వైపు వస్తున్నారు. దీంతో అనాదిగా వస్తున్న ఆదిమ జాతుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు నేటి గిరిజన యువత అంతగా అలవర్చుకోవడం లేదు. పోలవరం ముంపు సమస్యతో ఆదివాసీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రాజెక్టు పూర్తయి పూర్తిగా నీటి నిల్వ ప్రారంభమైతే చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలు పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉండటంతో గిరిజనులకు భవిష్యత్తుపై బెంగ పెరుగుతూనే ఉంది.
ఒకప్పుడు గిరిజనుల ఉపాధికి భద్రాచలం ఐటీడీఏ పెద్దపీట వేసేది. అందులో ముఖ్యంగా రాష్ట్ర డీఎస్సీతో సంబంధం లేకుండా ‘ఏజెన్సీ డీఎస్సీ’ని ప్రత్యేకంగా ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేవారు. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను సైతం ఐటీడీఏ ద్వారా భర్తీ చేస్తుండేవారు. ఇలా గిరిజనుల స్వయం నిర్ణయాధికారం కలిగి ఉన్న ఐటీడీఏ నేడు ఒక సాధారణ పరిపాలన కార్యాలయంగా మారడంతో గిరిజనులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఐటీడీఏలోని వైటీసీ సహకారంతో కొందరు గిరిజన యువతను ఎంపిక చేసి తాత్కాలిక ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నా గిరిజన యువత నుంచి ఆశించిన స్పందన రావడం లేదు.
భద్రాచలంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం భద్రాచలం ఐటీడీఏ, వివిధ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్యం వీరులకు నివాళులర్పించడం, పట్టణంలో ఆదివాసీలతో భారీ ర్యాలీ, అన్నదానం, గిరిజన భవనంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభచాటిన గిరిజనులకు సన్మానం, ఐటీడీఏ పీవో బి.రాహుల్ గిరిజన భాషలో ప్రసంగం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి. భద్రాచలంతోపాటు చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లో సైతం ఆదివాసీ దినోత్సవ వేడుకలను పెద్దఎత్తున నిర్వహించనున్నారు. భద్రాచలంలో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో బి.రాహుల్‌తోపాటు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు.