పీర్జాదిగూడ జూన్ 6 : అనుమానస్పద స్థితిలో ఓ విద్యార్థి ఉరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా ఘనపూర్ మండలం లింగాల గ్రామానికి చెందిన పోమ వెంకటేష్ కుమారుడు సాయిరాం( 22) నగరంలోని రామంతపూర్ లో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుకుంటూ పీర్జాదిగూడ ఉప్పల్ డిపో సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
ఈనెల 1వ తేదీన తన స్వగ్రామం వెళ్లి కళాశాల ఫీజు కట్టాలని చెప్పి తండ్రి వద్ద నుంచి రూ.34వేలు తీసుకొని గురువారం రాత్రి తిరిగి ఉప్పల్ డిపో వద్ద ఉన్న గదికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తన కుమారుడు ఆత్మహత్య పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.