శామీర్పేట, ఏప్రిల్ 25 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలో రూ.18 కోట్లతో నిర్మించిన రోడ్డు నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదకరమైన గుంతలు, రోడ్డు పక్కన పెద్ద పెద్ద ముళ్ల పొదలతో అధ్వాన పరిస్థితికి చేరింది. దీంతో తరచూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ పట్టించుకునే నాథులు లేకపోవడంతో ఆ రోడ్డుగుండా వెళ్లే పది గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం హయాంలో నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో దాదాపు రూ.18 కోట్లు వెచ్చించి శామీర్పేట- ఉద్దెమర్రి ఉషార్పల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాజీవ్ రహదారి శామీర్పేట, బాబాగూడ, బొమ్మరాశిపేట, పొన్నాల్, ఆద్రాస్పల్లి, ఉద్దెమర్రి, ఉషార్పల్లి ఇలా దాదాపు 10 గ్రామాల మీదుగా మూడు జిల్లాల లింకు రోడ్లను కలుపుతూ ఈ రోడ్డు నిర్మించారు. దాదాపు పదేండ్లుగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రోడ్డు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిర్వహణ లోపం కారణంగా గుంతలతో ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లోపానికి గురై బాబాగూడ సమీపంలో దాదాపు 3 నుంచి 5 ఫీట్ల మేర రోడ్డు ధ్వంసమై పెద్ద (గుంత)కయ్యకోసింది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోయను తలపించే కయ్యతో పాటు రోడ్డుకు ఇరువైపు ప్రమాదకరంగా పెరిగిన ముళ్ల పొదలు, చెట్లతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికి ఈ రోడ్డుపై పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డును మరమ్మతు చేయించడంతో పాటు నిర్వహణ చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.