Sarojini Garden | కుత్బుల్లాపూర్, మార్చి15: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ సరోజినీ గార్డెన్ స్థలం వివాదాస్పదంగా మారింది. సర్వేనెంబర్ 48/పీలో బషీరాబాద్ విలేజ్ పేట్లో 5807 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలం సరోజినీ గార్డెన్‌కు అనుకొని ఉంది. ఇటీవల ఆ స్థలంలో బహుళ అంతస్తులు నిర్మాణాన్ని నిర్మించేందుకు కొంతమంది వ్యక్తులు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి అనుమతులు పొందారు. స్థలాన్ని చదును చేస్తున్న క్రమంలో స్థానికులు అభ్యంతర వ్యక్తం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెవెన్యూ అధికారులు సందర్శించి 5807 గజాల స్థలం యుఎల్‌సీ ల్యాండ్ సంబంధించిందని దీనిలో ఎలాంటి నిర్మాణం చేపట్టారాదని గత డిసెంబర్ 11న అధికారులు ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు.
అయితే ఏర్పాటు చేసిన ప్రభుత్వ బోర్డును కబ్జాదారులు తొలగించారు. సమాచారం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు ఈనెల 13న సంఘటన స్థలానికి వెళ్లి తిరిగి బోర్డు ఏర్పాటు చేసేందుకు ముందుకెళ్లారు. దీంతో కొంతమంది భూఆక్రమణదారులు అధికారులను అడ్డగించి వారి విధులకు భంగం కలిగించారు. దీంతో ఆర్ఐ విజయ్ కుమార్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదే రోజు రాత్రి పోలీసుల రక్షణతో మరోసారి బోర్డును ఏర్పాటు చేశారు. అధికారుల విధులకు భంగం కలిగించిన డి.రథన్ కుమార్, శ్రీనివాసరావు, డి శేఖర్ బాబు, డి వెంకట్ రావు, డి సతీష్ బాబులపై ఫిర్యాదు చేయగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జాతీయ రహదారి 44కు ఆనుకొని ఉన్న సరోజిని గార్డెన్ స్థలం కోట్ల రూపాయాల విలువ చేస్తుంది. అయితే దానికి అనుకొని ఉన్న యుఎల్‌సీ స్థలాన్ని సైతం కబ్జా చేసేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పాత్ర గణనీయంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ స్థలంలో తప్పుడు ద్రువీకరణ పత్రాలను సృష్టించి బహుళ అంతస్తుల నిర్మాణం కోసం అనుమతులు పొందారు. గుట్టు చప్పుడు కాకుండా స్థలంలో బహుళ అంతస్తులు నిర్మించేందుకు పూనుకున్నారు. అయితే విషయం బయటపడడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి యు ఎల్ సి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో సదరు ఎమ్మెల్సీ తన పలుకుబడిని ఉపయోగించి కోర్టులో ఫీల్ దాఖలు చేశాడు. కోర్టు జిల్లా యంత్రాంగానికి స్థలం పరిశీలన చేసి చూడాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు స్థలాన్ని సర్వే చేపట్టగా ప్రభుత్వ స్థలాన్ని తేలింది. దీంతో కోర్టులో ఫిర్యాదును కొట్టివేసింది. అయినప్పటికీ తిరిగి అదే స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్న కొంతమంది ఆక్రమణదారులు అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును అనధికారికంగా తొలగించడంతో పాటుగా అధికారుల విధులకు భంగం కలిగించిన ఆక్రమణదారులపై రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంపై చర్చనీయాంశంగా మారింది.