రామంతాపూర్, జూన్ 29 : దేశంలో ఒకే కులవృత్తి చేస్తున్న ఏకైక కులం రజక కులస్తులు మాత్రమేనని, కాని భిన్న రిజర్వేషన్లు ఉండటం వల్ల అసమానతలు తలెత్తుతున్నాయని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దాపురం కుమారస్వామి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిసిన రజక సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు. తదనంతరం ఓయూ జేఏసీ నాయకుడు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రజక విద్యా సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవలూటి శంకర్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ గతంలో రజక కులస్తుల తరపున మండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవితకి ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో రజకుల సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని మండలిలో లేవనెత్తి మాకు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ 18 రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నప్పుడు మిగతా 11 రాష్ట్రాలను ఎస్సీ జాబితాలో చేర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన సమస్య ఏమిటో తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శాగంటి వెంకటేష్, కల్లకుంట బ్రహ్మయ్య పాల్గొన్నారు.