KP Vivekananda | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 22: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలను పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 132 జీడిమెట్ల డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేపీ వివేకానంద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి రజతోత్సవ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్షతపై స్వరాష్ట్ర సాధన ద్వారానే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అన్ని రంగాలలో అగ్రపథాన నిలిపిన మహోన్నత శక్తి, మన నాయకులు కేసీఆర్ అని కొనియాడారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని తెలిపారు. రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో బయల్దేరి వెళ్లి మన ఐకమత్యాన్ని, క్రమశిక్షణను తెలియజేయాలని పిలుపునిచ్చారు.