Fish | కీసర, ఫిబ్రవరి 9: సండే వచ్చిందంటే చాలు ఒకప్పుడు చికెన్, మటన్ తినాలని అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు జనాలు చేపల కోసం క్యూ కడుతున్నారు. ఆరోగ్యరీత్యా చేపలు ఆరోగ్యానికి మంచివని వైద్యులు చెప్పడంతో వాటికే మొగ్గుచూపుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపలకు మంచి గిరాకీ పెరిగింది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండల కేంద్రంలోని మత్య్సకారులు కూడా మంచి ఉపాధి పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ మత్స్య సంపదను ప్రోత్సహించేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో కీసర మండలంలో ముదిరాజ్‌లకు చేప పిల్లలను పంపిణీ చేయడంతో నూర్ మహమ్మద్ చెరువు, పెద్దమ్మ చెరువులో వాటిని పెంచుతూ చక్కటి ఉపాధి పొందుతున్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకమే తమకు చక్కటి మార్గమైందని ముదిరాజ్‌లు గుర్తుచేసుకుంటున్నారు.
కేసీఆర్ మా ముదిరాజ్‌ల పాలిట దేవుడు అని పొగుడుతున్నారు. కేసీఆర్ మా ముదిరాజ్ కులస్థులకు చూపించిన ఉపాధి, ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. ఆ ప్రోత్సాహంతోనే ప్రతి ఆదివారం చెరువులో చేపలు పట్టి వాటిని అమ్ముకుని ఉపాధి పొందుతున్నామని కీసరకు చెందిన ముదిరాజ్ మత్స్య కార్మికుడు రాగుల సురేందర్ తెలిపాడు.