Ration Cards | మేడ్చల్, జూలై20(నమస్తే తెలంగాణ): రేషన్ కార్డులు ఇస్తారా.. ఇయ్యారా అంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హలైన వారందరికి రేషన్ కార్డులు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపుతున్న అర్హలైన దరఖాస్తుదారులకు ఇప్పటి వరకు అందడం లేదంటున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో ఇప్పటికీ ఇంకా 81 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.22 లక్షల దరఖాస్తులు వస్తే ఇందులో నుంచి నామమాత్రంగా 25,118 రేషన్ కార్డులను మాత్రమే జారీ చేయగా మిగతా దరఖాస్తుల్లో కొన్నింటిని తిరస్కరించగా, 81 దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అర్హలైన వారికి రేషన్ కార్డులు అందకపోవడం, అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తుల విచారణలో కావాలనే అధికారులు జాప్యం చేస్తున్నట్లు విమర్శలను అధికారులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
రేషన్ కార్డులు అందని వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తులపై విచారణ చేస్తున్నామని విచారణ అనంతరం రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి అధికారులు తప్పించుకున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తులను ఇంకా ఎన్ని రోజులు విచారణ చేస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రమాణికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలను పొందేందుకు తప్పని సరిగా రేషన్ కార్డులు ఉండాల్సిందే. దీంతో నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తాము అధికారులకు చెబితేనే రేషన్ కార్డులు జారీ అవుతాయని బాహాటంగా ప్రచారం చేసుకుంటున్న క్రమంలో అసలైన అర్హులు తమకు రేషన్ కార్డులు వస్తాయా రావా అంటూ ఆందోళన చెందుతున్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ అవుతున్నాయని అధికారులు చెబుతున్నా దరఖాస్తుదారుల సంఖ్య ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నిస్తున్నారు. అర్హులైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే రేషన్ కార్డులు జారీ చేసి నిరుపేదలను అదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రేషన్ కార్డులను తక్కువ సంఖ్యలో జారీ చేస్తూ రేషన్ కార్డులు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటుందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.