HCU Land Issue | బోడుప్పల్, ఏప్రిల్ 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూ సేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమని ఓయూ టీఎస్ జాక్ స్టేట్ కో కన్వీనర్ వర్కల శివ కిషోర్ గౌడ్ హెచ్చరించారు.
బోడుప్పల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని దెబ్బతీసేలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ దిశలో సాగుతున్న రాష్ట్రాన్ని బజారు కీడ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు
బుల్డోజర్ల పరిపాలన కొనసాగిస్తే పెట్టుబడులు రావు..
పోరాడి తెలంగాణ సాధించుకున్న చరిత్ర తెలంగాణ ప్రజలదని, అదే పోరాట స్ఫూర్తితో హెచ్సీయూ భూముల ఆక్రమణను అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానేసి విద్యార్థులతో చర్చలు జరపాలన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ప్రభుత్వము అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
భవిష్యత్ తరాల కోసం యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం కాకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అండగా ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ల పరిపాలన కొనసాగిస్తే పెట్టుబడులు రావని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించి పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.