నేరేడ్మెట్, జనవరి 27: మాటలు కాదు, పనులే బీఆర్ఎస్ పాలనకు చిరునామా అన్నది మరోసారి రుజువైంది. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల చిరకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ రైల్వే అధికారుల చుట్టూ తిరిగి, అవసరమైతే కేంద్రంతో ఢీకొని మరీ అభివృద్ధి పనులు సాధించిన ఘనత మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికే దక్కింది. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొవాలనే సంకల్పంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్క తగ్గకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రూ.80.47కోట్ల వ్యయంతో చేపట్టనున్న కీలక అభివృద్ధి పనులకు మంగళవారం ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజేందర్ రెడ్డి నేరేడ్మెట్ రైల్వే స్టేషన్ వద్ద శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరి ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర పట్టించుకోకపోయినా, నేను మాత్రం వెనిక్కి తగ్గలేదన్నారు. రైల్వే అధికారులతో నిరంతరం కో ఆపరేట్ అవుతూ అవసరమైతే వందసార్లు వారి కార్యాలయాల చుట్టూ తిరిగి ఈ పనులను సాధించగలిగినందుకు ఎంతో సంతోషకంగా ఉందన్నారు. ట్రాఫిక్ గంటల తరబడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్రం చూసి చూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు.
ఆ నిర్లక్ష్యానికి చెక్ పెట్టేందుకే రూ.74.47 కోట్లతో ఆర్యుబి పనులు సాధించాం. ఇది మల్కాజిగిరి ప్రజల పోరాటానికి దక్కిన విజయం అని అన్నారు. సఫిల్‌గూడ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ నరకయాత నుంచి శాశ్వత విముక్తి కలిగించేందుకే రూ.12.81కోట్లతో ఎల్హెచ్ఎస్ సబ్వే పనులు ప్రారంభిస్తున్నాం అని స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధి విషయంలో నేను ఎలాంటి రాజీ పడను. కేంద్రంతో మాట్లాడాల్సి వస్తే మాట్లాడాం. పోరాడాల్సి వస్తే పోరాడాం. చివరకు మల్కాజిగిరి ప్రజలకు న్యాయం జరిగేవరకు నిద్రపోలేదు అని వ్యాఖ్యానించారు. 130 ఇళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన వెంటనే కేవలం ఎనిమిది ఇళ్లకు ఆర్ఎఎంబి తీసుకురావడంలో రైల్వే అధికారులు సహకరించటం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
మల్కాజిగిరికి ఇప్పుడు బంగారు రోజులు వచ్చాయని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా.ఆర్. గోపాల్‌కృష్ణ, అడిషినల్ డిఆర్ఎం కే. ముత్యాల నాయుడు, ఎస్సీఆర్ సీపీఆర్ఓ శ్రీధర్‌రావు, డిజిఎం ఉదయ్‌నాథ్, నియోజకవర్గం కార్పొరేటర్లు నేరేడ్మెట్ కార్పొరేటర్ మీనా, వినాయనగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవన్ కుమార్, గౌతంనగర్ కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్, అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం కార్పొరేటర్ సబిత కిషోర్ , పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.