శామీర్ పేట, జనవరి 19 : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే కేసీఆర్ మూడు చింతలపల్లి, అలియాబాద్ లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది వేశారని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ దూరదృష్టి వల్లే నేడు ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యమవుతోందని పేరొన్నారు.
సోమవారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయాన్ని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మలాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు భూ సంబంధిత సేవలు సులభంగా, వేగంగా అందేలా పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకొచ్చిందే కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు.
అలాగే మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల పరిధిలో దాదాపు రూ.30 కోట్ల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాల్ని కూడా పట్టణ స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి, మౌలిక వసతులకు పెద్దపీట వేశారని, ఆ విధానాల ఫలితమే నేటి అభివృద్ధి అని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని మల్లారెడ్డి భరోసా ఇచ్చారు.