కాప్రా, జూన్ 18 : వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వివిధ శాఖల అధికారులకు సూచించారు. గురువారం కాప్రా సర్కిల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో సర్కిల్ ఇంజినీరింగ్, జలమండలి, విద్యుత్, లాఅండ్ ఆర్డర్, ట్రాఫిక్ సీఐ, హైడ్రా.. తదితర విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆయావిభాగాల అధికారులు, సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, నాలాల శుభ్రత, రోడ్ల మరమ్మతులు, నీటి నిల్వలు, విద్యుత్‌సరఫరా, తాగునీటి సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
అన్ని లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి, వర్షాల కారణంగా తలెత్తే సమస్యను వెంట వెంటనే పరిష్క రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి అత్యవసరపరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కాప్రా సర్కిల్ డిప్యూటీకమిషనర్ రవీందర్‌సాగర్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి, డీఈఈ బాలకృష్ణ, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ కళ్యాణి, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.