కుత్బుల్లాపూర్,ఆగస్టు11: ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు, అనుమతులు వెంటనే మంజూరీ చేయాలని కోరుతూ ఢిల్లీలోని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరించారు. ఇందులో భాగంగానే జాతీయ రహదారి 44 బోయిన్పల్లి నుంచి మేడ్చల్ చౌరస్తా వరకు ఆరులైన్లతో కూడిన రహదాని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో డెయిరీ ఫామ్ నుంచి సుచిత్ర మీదుగా దూలపల్లి, కొంపల్లి వరకు ఆరులైన్లతో కూడిన మూడు ఫ్లైఓవర్లు, 10 కిలోమీటర్ల పరిధిలో ఇరువైపులా ఏడు మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్ల నిర్మాణం, 5 జంక్షన్ల అభివృద్ధికి రూ.475 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని వివరించారు. వీటి నిర్మాణం కోసం కావాల్సిన నిధులు మంజూరు చేసి అనుమతులు ఇచ్చి పనులు వేగంగా ప్రారంభించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.