జవహర్‌నగర్, ఆగస్టు 29: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గొప్ప మహోన్నత వ్యక్తి,నేటితరానికి ఆదర్శమని మంత్రులు చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అణగారిన వర్గాల బాధలను ప్రత్యక్షంగా చూసి రాజులను, అరాచక పరిపాలనను ఎదిరించారని మంత్రులు పేర్కొన్నారు. జవహర్‌నగర్ పరిధి అంబేద్కర్‌నగర్‌లో ఆదివారం పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ప్రజల కోసం మహారాష్ట్రలో శివాజీ ఎలా పోరాడారో, పాపన్నగౌడ్ కూడా తెలంగాణలో జాగీర్దారులు, భూస్వాములు పాలన అంతానికి పోరాడారని గుర్తు చేశారు. స్థానిక గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌లో అధికంగా పేదలున్నారని, ఇక్కడ 58, 59 జీవో అమలు కావడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మంత్రి మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌గుప్తా, పలువురు కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు మేకల అయ్యప్ప, రాష్ట్ర గౌడ సంఘం మొకుదెబ్బ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, స్థానిక గౌడ సంఘం నాయకులు హాజరయ్యారు.