పోచారం,ఏప్రిల్29 : నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండి సేవలు అందిస్తేనే గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడలోని ఓ ఫంక్షన్ హల్లో రాష్ర్ట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా ప్రతినిధుల సదస్సు మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నప్పుడే ప్రజా నాయకుడిగా గుర్తుపెట్టుకుంటారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభ కనబరుస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు మరింతగా స్వేచ్ఛనిస్తే, అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తూ రాష్ట్ర, దేశ పురోగతిలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ, చాకలి అయిలమ్మ వంటి మహిళలను ఆదర్శంగా మరింత ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. మహిళలు రాజకీయాల్లో మరింత ఎక్కువ మంది ముందుకొస్తే రాష్ర్ట, దేశ పురోగాభివృద్ధి అనుకున్న విధంగా సాధ్యం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెహల్గాం మృతులకు సంతాపకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.