మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఊహించని విధంగా అనతికాలంలో అద్భుత విజయాలు సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Indipendence Day) సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు.
మంత్రి మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ కింద 5,937 పారిశ్రామికవేత్తలకు వివిధ శాఖల నుంచి 10,236 అనుమతులు ఇప్పించామని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 11 వేల 433 సూక్ష్మ చిన్న తరహా, 177 మద్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పడి రూ. 15,628 కోట్ల 29 లక్షల పెట్టుబడులు వచ్చి 2 లక్షల 26 వేల 939 మందికి ఉపాధి లభించిందన్నారు.
నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసే జనరల్, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వివిధ రాయితీలను అందిస్తామని వివరించారు. వ్యవసాయ రంగ ప్రగతికి ప్రస్తుత వానాకాలం సీజన్లో 35 వేల మంది రైతులకు రూ. 27 కోట్ల 84 లక్షలను రైతుబంధు ( Raitu Bandu ) పథకం ద్వారా సహాయం చేశామన్నారు. రైతుబీమా పథకంలో ఇప్పటి వరకు 456 మంది రైతుల కుటుంబాలకు రూ. 22 కోట్ల 80 లక్షలను అందించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 118 బస్తీ దవాఖానలను మంజూరు చేయగా ఇప్పటి వరకు 101 బస్తీ దవాఖానలు ప్రారంభమై వైద్య సేవలు అందుతున్నట్లు పేర్కొన్నారు.
మూత్రపిండాల వ్యాధులతో బాధపడే రోగులకు ఉపయోగపడే విధంగా రూ.50 కోట్లతో డయాలసిస్ కేంద్రం మంజూరైందన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 వందల మందికి దళితబంధును అందించామని, రెండవ విడతలో 5వేల 5 వందల మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు. హరితహారం ద్వారా పల్లె, పట్టణ ప్రగతిల ద్వారా పచ్చదనంతో ఆహ్లాదంగా మారినట్లు చెప్పారు. విధులలో ప్రతిభ చూపిన ఉద్యోగులకు మంత్రి, కలెక్టర్ అవార్డులు, ప్రశంసాపత్రాలు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ ఆగ్యస్త , జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీసీపీ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.