శామీర్‌పేట (హైదరాబాద్) : తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు. శామీర్‌పేట గ్రామంలో బుధవారం నిర్వహించిన ఆశీర్వాద సభలో మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
60 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల పాలనలో ప్రజలకు మేలు జరగలేదని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంలో ముఖ్యమంత్రి చేసిన కృషి ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో గుక్కెడు మంచినీళ్ల కోసం పడ్డ కష్టాలు ప్రజలు మరచిపోలేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితులు కనబడకుండా పోయాయని తెలిపారు. గోదావరి, కృష్ణ జలాలతో తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ తాగునీరు, సాగునీటిని అందించిన మహనీయుడు అన్నారు. ఆడపిల్లలకు మేనమామలాగా కల్యాణలక్ష్మి (Kalyanalaxmi), షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, రైతన్నకు వెన్ను దన్నుగా నిలుస్తున్న రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే అనుక్షణం పాటుపడుతుందని తెలిపారు.
కనీస సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, సర్పంచ్ బాలమణి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, ఉపసర్పంచ్ రమేశ్‌యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డైరెక్టర్లు మాదవి, ఆజయలక్ష్మీ, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, మేడి రవి, లాలయ్య, సోనీ, ఆఫ్జల్‌ఖాన్, వెంకట్‌రెడ్డి, మురళి, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.