Congress | మేడ్చల్, మార్చి9(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పార్టీ నేతల్లో సమన్వయ లోపంతో క్యాడర్లో పూర్తిగా నిరుత్సాహం నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లే లేదనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సహం నీరుకారుతుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో పార్టీలోని నేతల మధ్య సమన్వయ లోపంతో కాంగ్రెస్ కార్యకార్యకర్తలు మిన్నకుండి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
నియోజకవర్గ ఇంచార్జీలు అసంతృప్తి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పోటీ చేసి ఓడిపోయిన నేతలకే నియోజకవర్గ ఇంచార్జీలు ఇచ్చినా ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గాలలో అభివృద్ధి పథకాలకు సంబంధించి పెద్దగా పనులు జరగకపోవడం వీరికి ఎలాంటి ప్రోటోకాల్ లేకపోవడంతో కార్యకర్తలు వచ్చి నియోజవర్గ ఇంచార్జీలను కలిసిన ఎలాంటి పనులు కాకపోవడంతో కార్యకర్తలకు ఎలాంటి న్యాయం జరగపోవడంతో మిన్నకుండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన వీరికి అధికారుల నుంచి ప్రోటోకాల్ ఆహ్వానం అందకపోవడంతో పోలేని పరిస్థితి వచ్చింది.
జిల్లా వ్యాప్తంగా నామినేటేడ్ పోస్టులను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు కేటాయించకపోవడంతో నాయకులు నిరుత్సాహానికి గురువుతున్నారు. ప్రభుత్వ పెద్దలు సహకరించకపోవడం నామినేటేడ్ పోస్టులను జిల్లాకు ఇవ్వకపోడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనులు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. దీనికి తోడు జీహెచ్ఎంసీ పరిధిలో నియోజకవర్గాలలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇంటి పథకం, రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందించకపోవడంతో ప్రజలను ఎలా కలిసేదని కార్యకర్తలు నాయకులు వద్ద చెప్పుకుంటున్నారు. జిల్లాలోని పెద్ద నాయకుల మధ్య సమన్వయలోపంతో అసలు పార్టీ సమీక్షా సమావేశాలు జరిగిన దాఖలాలు అసలే కనిపించడం లేదు.
సమీక్షా సమావేశాలకు రాని జిల్లా ఇంచార్జి మంత్రి
జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చేలా జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టరేట్లోనైన సమీక్షా సమావేశాలు నిర్వహించకపోవడం కొంత నిరుత్సాహనికి గురి చేస్తుంది. పథకాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే జిల్లాలో ఎలాంటి ప్రోటోకాల్ లేని నేతలు ఏదైనా ఉంటే మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పుకునే అవకాశం ఉంటుందని భావించిన ఇలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో మరింత నిరుత్సాహం ఆవరిస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలోని నేతలను సమన్వయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల సహకారం అందిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నిండేలా కనపడటం లేదు.