జీడిమెట్ల, జూలై25 : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి క్వారీ గుంతలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఎలక్ట్రీషియన్ భూపతిరాజు కిషోర్ తన తల్లిదండ్రులతో కలిసి 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలో నివాసముంటున్నాడు.
కాగా ఇతని తండ్రి రామకృష్ణం రాజు 2010లో మరణించగా, 2022 జనవరిలో తల్లి సైతం మృతి చెందింది. దీంతో జల్సాలకు బానిసైన కిషోర్ పనీ పాట లేకుండా తిరుగుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో 24వ తేది ఉదయం 9 గంటల ప్రాంతంలో జయభేరి పార్కు సమీపంలోని క్వారీ గుంతలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మృతుడి అన్న భూపతిరాజు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.