సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేలా బడ్జెట్లో ( Budge t) నిధులు పొందుపరచాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) డిమాండ్ చేశారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ను తయారు చేయాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు (Six Guarntees) అమలు చేస్తామని సోనియా, రాహుల్ రాసిచ్చిన బాండ్ పేపర్లు ఏమాయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 800 రోజులైనా ఒక్క హామీకి దిక్కులేదని, గెలిచిన నెలకే వృద్ధులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ. 4000 పెన్షన్ అన్నారు. 27 నెలలైనా రాలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిధులు పెడతారా, లేదా? అంటూ ప్రశ్నించారు.
నెలకు రూ. 2500 ఇస్తామని ఆశచూపి మహిళల ఓట్లు దండుకున్నారు. ఒక్కరికైనా రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. వెంటనే బడ్జెట్లో మహిళలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టారని, రాజీవ్ యువ వికాసం అంతా బూటకమని మండిపడ్డారు. కాంగ్రెస్ తెచ్చిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ ఉత్త మాటలే. అసెంబ్లీలో మాయ మాటలు మాని, వాస్తవ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కోరారు.
ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను డిమాండ్ చేశారు. చదువుకునే పిల్లలకు టెన్త్ పాస్ అయితే రూ. 10వేలు, ఇంటర్ పాస్ అయితే రూ. 25 వేలు, డిగ్రీకి రూ. 50వేలు, పీజీ చదివితే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి, ఈరోజు వరకు ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఏటా రూ. 20 వేలు కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక బీసీలకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపిందని విమర్శించారు . వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అని చెప్పి మాయమాటలు చెప్పారని, ఏటా రూ. 15వేలు రైతుబంధు, పంటల బీమా, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను నిలువునా దగా చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, యువత.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిందని పేర్కొన్నారు. గతంలో అవ్వాతాతలకు కేవలం రూ. 200 ఉన్న పెన్షన్ను కేసీఆర్ రూ. 2 వేలకు చేయగా కాంగ్రెస్ రూ. 4వేలు ఇస్తామని హామీ ఇప్పటి వరకు నెరవేర లేదని అన్నారు.
ఈనెల 26న ప్రవేశపెట్టే బడ్జెట్లో బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ బాధితులు, గీత , చేనేత కార్మికులందరికీ తక్షణమే రూ. 4వేలు పెన్షన్ ఇచ్చేలా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్లో చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం ఈ బడ్జెట్నైనా వాస్తవాల ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలని, రూ. 4000 పెన్షన్, మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చే హామీలను అమలు చేసేలా బడ్జెట్లో నిధులు పొందుపరచాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.