Pomegranate | మనిషి ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల పండ్లల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. దానిమ్మ పండు చాలా రుచిగా ఉంటుంది. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దానిమ్మ పండును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దానిమ్మ అందరికీ ఒకేవిధమైన ప్రయోజనాలను అందించదని వైద్యులు చెబుతున్నారు. కొందరికి దీనిని తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొందరు ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతూ ఉంటారు. దానిమ్మ గింజలు ఈ మందులతో కలిసి శరీరానికి ఎక్కువ హానిని కలిగించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ ఇవి అందరికీ సరిపడవని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మపండ్లకు ఎవరెవరు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ పండ్లల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. రోజుకు 300 ఎమ్ఎల్ దానిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల రెండు నెలల్లో దాదాపు 5 mmHg వరకు సిస్టొలిక్ రక్తపోటు, దాదాపు 3 mmHg డయాస్టొలిక్ రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే హైపోటెన్షన్ తో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు మరింత తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు దృష్టి లోపం, మూర్ఛ, తీవ్రమైన సందర్భాల్లో షాక్ వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మ ఏసీఈ ఇన్హిబిటర్లు, స్టాటిన్స్, బీటా బ్లాకర్స్, యాంటీకోగ్యులెంట్స్ వంటి మందులతో సంకర్షణ చెందుతుంది. దానిమ్మ పండులో ఉండే సమ్మేళనాలు ఈ మందులను కాలేయం ప్రాసెస్ చేసే విధానాన్ని నెమ్మదిస్తాయి. దీంతో మందులు శరీరంలో ఎక్కువ సమయం ఉండడం వల్ల శరీరంలో ఔషధ స్థాయిలు పెరుగుతాయి. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎక్కువవుతాయి. గుండె సమస్యలతో బాధపడే వారికి, దీర్ఘకాలిక మందులు తీసుకునే వారికి ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
దానిమ్మపండ్లు రక్తం గడ్డకట్టే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కనుక శస్త్రచికిత్స జరగడానికి ముందు కనీసం రెండు వారాల పాటు దానిమ్మ పండ్లను తీసుకోకూడదని వైద్యులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా అనస్థీషియా మందులతో కూడా ఇవి సంకర్షణ చెందుతాయి. దీంతో శస్త్ర చికిత్స సమయంలో రక్తస్రావం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అలాగే దానిమ్మ పండ్లల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియుకు ఎంతో మేలు చేస్తుంది. కానీ సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వారిపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పండ్లలో టానిన్లు ఉంటాయి. ఇవి పేగు పొరలకు చికాకును కలిగిస్తాయి. ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవి గట్టిగా ఉంటాయి. త్వరగా జీర్ణం కావు. కనుక వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అంతేకాకుండా దానిమ్మ పండ్లు కొందరిలో అలర్జీని కలిగించే అవకాశం ఉంది. దురద, ముఖం వాపు రావడం, దద్దుర్లు, తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, అనాఫిలాక్సిన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహార అలర్జీ ఉన్న వారిలో దానిమ్మతో క్రాస్ రియాక్షన్ లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ అందరికి ఇవి అనుకూలంగా ఉండవని వైద్యులు చెబుతున్నారు. అలర్జీ ఉన్న వారు, శస్త్రచికిత్స షెడ్యూల్ చేయబడిన వారు, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్న వారు, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు వీటిని తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.