శాలిగౌరారం, ఫిబ్రవరి 20 : మద్యం మత్తులో కన్న తండ్రిని కొడుకే చంపిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిగూడెంకు చెందిన బుర్రే సత్తయ్య(60) కొడుకు బాలకృష్ణ రోజూ పూటుగా మద్యం సేవించి ఇంటిల్లిపాదిని ఇబ్బంది పెట్టేవాడని తెలిపారు. గురువారం సైతం మద్యం తాగివచ్చి ఇంట్లో గొడవ పడుతుండగా తండ్రి సత్తయ్య వారించడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు బాలకృష్ణ ఇంట్లోంచి తండ్రి సత్తయ్యను గల్లా పట్టి బయటికి లాక్కుంటూ వచ్చి సీసీ రోడ్డు మీద నెట్టివేయడంతో వెనుక భాగంలో రోడ్డు పైన కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయాన్ని శాలిగౌరారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.