Keesara | కీసర, ఫిబ్రవరి 28: కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులతో కోలహలంగా మారిపోయింది. మహాశివరాత్రి పర్వదినం ఐదో రోజు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి వచ్చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో కీసరగుట్టకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు నేరుగా శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారిని, శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం, శ్రీ నాగదేవతలను దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా శివలింగాలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించుకొని మొక్కులు తీర్చుకున్నారు. శివలింగాలకు పాలు, పెరుగు, పంచామృతంతో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించుకున్నారు.
ఘనంగా స్వామివారి విమాన రథోత్సవం
స్వామివారిని డప్పు, బ్యాండ్ మేళాలతో విమాన రథోత్సవంలో భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని స్మరించుకున్నారు. కీసరగుట్ట ఆలయ ప్రాంగణం నుంచి నందీశ్వరుడి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి ఆపూర్వ స్పందన లభించింది.
ఘనంగా స్వామివారిని విమాన రథోత్సవంలో ఊరేగింపు
ఘనంగా అన్నాభిషేకం
గర్భాలయంలోని శ్రీ మూలవిరాట్స్వామివారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ వేదపండితులతో కలిసి అన్నాభిషేకం నిర్వహించారు. గర్భాలయంలోని శివుడిని పూర్తిగా అన్నంతో కప్పి వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
యాగశాలలో పూజలు చేస్తున్న వేదపండితులు
కీసరగుట్టలో రేపు
మార్చి 1వ తేదీన ఉదయం 5.30గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణమంటపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 11గంటలకు యాగశాలలో పూర్ణాహుతి, పండితసన్మానంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుంది.
ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యూత్ క్రీడలను ప్రారంభిస్తున్నన్న ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ
ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైన యూత్ క్రీడలు
మహాశివరాత్రి సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం విద్యార్థులకు క్రీడలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ యూత్ క్రీడలను ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు మార్చి 1వ తేదీన జాతర ముగింపు రోజున ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బహుమతులను ప్రదానం చేయనున్నారు.