MSF | దుండిగల్, మార్చి15 : సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకువస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎస్సీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన పలువురు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులతో కలిసి బాచుపల్లి లోని తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్యోగ నియామకాల ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఎస్సీ ఉద్యోగాలన్ని మాలలకే చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఎస్సీ వర్గీకరణ లేకపోవడం వల్ల గత 70 ఏళ్లుగా ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ అన్యాయాన్ని గుర్తించే సుప్రీం కోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ చారిత్రక తీర్పును ఇచ్చిందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయాలని ప్రయత్నించడం దారుణమని అన్నారు.
మార్చి 17న ఎస్సీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో పెడతామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పటి వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలు నిలిపివేస్తే ఏమి నష్టం జరుగుతుందో అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టం అసెంబ్లీలో ఆమోదించడంతో పాటు త్వరగా అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి భైరపోగు శివకుమార్ మాదిగ, ముదిగొండ నవీన్, ప్రశాంత్, దుద్దెల హరిప్రసాద్, అశోక్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.