Hyderabad | దుండిగల్, మార్చి2: వారాంతపు సెలవు దినాల్లో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పని దినాల్లోనే రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుంటున్న అక్రమార్కులు.. వారాంతం రాగానే ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారు. శనివారం సాయంత్రం నిర్మాణాలు మొదలుపెట్టి ఆదివారం సాయంత్రం వరకు నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఏకంగా నిర్మాణాలకు రంగులు వేసి.. అందులోకి మనుషులను నింపుతున్నారు. గత కొంతకాలంగా ఈ తతంగం నిరాఘాటంగా కొనసాగుతోంది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ- దుండిగల్ మండలం బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీ పక్కనున్న ప్రభుత్వ స్థలం సర్వేనెంబర్ 576లో అప్పుడెప్పుడో 15 ఏండ్ల క్రితం ఇచ్చిన ఇందిరమ్మ పట్టాలను పంపిణీ చేసింది. వీటిని అడ్డుపెట్టుకున్న కొందరు వ్యక్తులు సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలను సృష్టించి వాటి ఆధారంగా సర్వే నెంబర్ 578,580లో నోటరీ చేసి ప్రభుత్వ భూమిని ఫ్లాట్లుగా మలిచి విక్రయాలు చేపడుతున్నారు. ఇలా భూ అక్రమార్కులు తమ దందాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకోవడం.. శని, ఆదివారాల్లో గదులు నిర్మించి పూర్తి చేయడం, అనంతరం వాటిని రూ.15-20 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు సంబంధించి ఆరు నెలల్లోగా ఇండ్లు నిర్మించుకోకపోతే ఆటోమేటిక్ గా పట్టా రద్దు అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అవే పట్టాలకు నకిలీ పట్టాలు సృష్టించి ఏళ్ల తరబడి చలామణిలోకి తెస్తూ కొందరు భూకబ్జాదారులు అక్రమాలకు పాల్పడుతుండగా అడ్డుకోవలసిన అధికారులు మాత్రం వారిచ్చే అమ్యామ్యాలకు ఆశపడి చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బౌరంపేట ఇందిరమ్మ ఇండ్ల సమీపంలోని ప్రభుత్వ భూమిలో గత రెండు, మూడు రోజులుగా కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతుండగా ఫోటోలు తీశాడని నేపంతో ఓ వ్యక్తిని శనివారం రాత్రి చితకబాదినట్లు తెలుస్తుంది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఒక మాఫియాగా ఏర్పడిన భూబకాసురులు ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయాలు చూస్తుంటే అధికారులు ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కావడంలేదని స్థానికుల పేర్కొంటున్నారు. తమ కబ్జాలకు అడ్డుపడుతున్న వారిపై దాడులకు తెగ పడుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలను పరిశీలించి, కబ్జాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.