LRS | మేడ్చల్, మార్చి30(నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్కు స్పందన కరవైంది. గడువు ముగుస్తున్న లక్ష్యం మాత్రం నేరవేరేలాలేదు. ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ పక్రియకు ఆశించిన మేరకు స్పందన రాలేదు. దీనికి అధికారుల నిర్ల్యక్షం వల్లే దరఖాస్తుదారులలో అవగాహన లేక ఇలా జరిగిందన అరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎల్ఆర్ఎస్ రాయితీకి 30 శాతానికి మాత్రమే పరిమితమైంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1.63 లక్షల దరఖాస్తులు రాగా ఇందులో 31వేల మంది దరఖాస్తుదారులు మాత్రమే క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించారు. అంటే 30 శాతం మాత్రమే ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకున్నారు. సుమారు లక్షకు పైగా దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచించిన ముందుకు రాలేకపోవడంలో అధికారుల నిర్లక్ష్యంగా కనపడుతుంది. ప్లాట్ల క్రమబద్దీకరణకు 25 శాతం రాయితీ చెల్లించి క్రమబద్దీకరించుకోవాలన్నా దరఖాస్తుదారులు ముందుకురాలేకపోయారు. ఈ నెల 31 రాయితీ గడువు ముగుస్తున్న క్రమబద్దీకరణకు సుమారు 78 వేల మంది ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే గడువు ముగిస్తే వీరి పరిస్థితి ఎమిటన్నది ప్రశ్నార్థకరంగా మారింది. అయితే తిరిగి క్రమబద్ధీకరించుకునేందుకు రాయితీ ద్వారా ఫీజలు చెల్లించే అవకాశం కల్పిస్తుందా లేకా రాయితీ కొనసాగించి గడువు పెంచే అవకాశం ఉంటుదా అన్నది వేచి చూడాల్సిందే. కాగా కొందరి దరఖాస్తుదారుల వద్ద సమయానికి ఫీజులు చెల్లించేందుకు చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డట్లు దరఖాస్తుదారులు తెలిపారు.