Maha Shivaratri | కీసర, ఫిబ్రవరి 24: కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నిర్వహించిన మొదటి రోజు పూజ కార్యక్రమాలకు మేడ్చల్ ఎమ్యేల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సోమవారం నుంచి వచ్చే నెల మార్చి 1వ తేదీ వరకు ఆరు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్‌రెడ్డి పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన సోమవారం నాడు పూజ కార్యక్రమాలను వేదపండితులు మారుతి సత్యనారాయణశర్మ, గణపతిశర్మ, బాల్రాంశర్మ, మోత్కురి రవిశర్మలు ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనమము, ఋత్విక్ వరణం, అగ్ని ప్రతిష్టాపన భేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, మంత్ర పుష్పం, పరాకస్తవం, తీర్ర్థ ప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలను అత్యంత వైభోపేతంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ-పద్మ దంపతులు పాల్గొన్నారు.
ఘనంగా యాగశాల ప్రవేశం
మొదటి రోజు పూజ కార్యక్రమం అనంతరం దేవస్థానానికి పక్కనే ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ వేదపండితులతో కలిసి యాగశాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాగశాల్లో సోమవారం నుంచి వచ్చే నెల మార్చి 1వ తేదీ వరకు కీసరగుట్టలోని టీటీడీకి చెందిన వేద విద్యార్థులు వేద మంత్రోచ్ఛరణ చేస్తారు.
Keesara2
స్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి బయలుదేరుట….
కీసరగుట్టలో ఉన్న స్వామివారిని కీసర గ్రామానికి బ్యాండ్ మేళాలతో తీసుకొస్తారు. ముదిరాజ్ కులస్థులు స్వామి వారిని కీసర నుంచి గుట్టకు తీసుకెళ్లడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఈనెల 25వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణం ఉండటంతో ఆ రోజు కీసర నుంచి కీసరగుట్టకు తీసుకెళ్తారు. భక్తులు అడుగడగునా స్వామివారిని సేవిస్తారు.
మేడ్చల్ ఎమ్మేల్యేకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు మేడ్చల్ ఎమ్మేల్యే చామకూర మల్లారెడ్డి విచ్చేశారు. ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ఆలయ ఈవో కట్టా సుధాకర్‌రెడ్డిలు వేదపండితులు కలిసి పూర్ణకుంభంతో ఘనంగా ఎమ్మేల్యేకు స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. స్వామివారికి మల్లారెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణ మందిరంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి శాలువతో ఘనంగా సత్కారం చేసి వేదపండితుల చేత ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో కీసరగుట్ట ఆలయ ధర్మకర్తలు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
కీసరగుట్టలో ఘనంగా అన్నదాన కార్యక్రమాలు
కీసరగుట్టలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కీసరగుట్టలో శ్రీ వంశిరాజ్ సంఘం, శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం, రెడ్డి భవన సంఘం, మున్నూరు కాపు సంఘం ఆధ్వరంలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాల వద్ద భక్తుల నుంచి కూడా ఆపూర్వ స్పందన లభించింది.
క్రీడకారులకు స్వర్గీయ మన్నే సుబ్రహ్మణ్యం పేరుమీద బహుమతుల ప్రదానోత్సవం
కీసరగుట్టలో నిర్వహిస్తున్న జాతర క్రీడోత్సవంలో విజేతలైన క్రీడకారులకు బహుమతులను మన్నెం ఇండస్ర్టీస్ ఎం.డీ. స్వర్గీయ మన్నేం సుబ్రహ్మణ్యం పేరుమీద అతని కుమారుడు మన్నెం నాగ ఫణీంద్ర షీల్డ్, క్యాష్ ప్రైజ్‌లను మన్నే సుబ్రహ్మణ్యం ట్రస్ట్, ఎం పవర్ కంపెనీ పేరుమీద బహుమతులను ప్రదానం చేశారు.